Monday, August 24, 2020

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*16.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|*

*హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥*

*శ్రీశుకుడు వచించెను* - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

*16.2 (రెండవ శ్లోకము)*

*ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|*

*నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥*

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని, అలంకరణములు గాని, లేకుండుట గమనించెను".

*16.3 (మూడవ శ్లోకము)*

*స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః|*

*సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ॥6898॥*

"మహారాజా! అచటికి వెళ్ళి, సుఖాసీనుడైన పిదప అదితి విధ్యుక్తముగా ఆయనను సత్కరించెను. అపుడు అదితి ముఖము దైన్యముతో వాడిపోయి యుండుటను జూచి కశ్యపుడు ఆమెతో ఇట్లనెను"

*16.4 (నాలుగవ శ్లోకము)*

*అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేఽధునాఽఽగతమ్|*

*న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః॥6899॥*

"కల్యాణీ! ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదుగదా! ధర్మపాలన చక్కగా కొనసాగుచున్నదిగదా! భయంకరమైన కాలమునకు వశులైన జనులకు ఎట్టి అశుభమూ ప్రాప్తింపలేదుగదా!"

*16.5 (ఐదవ శ్లోకము)*

*అపి వాకుశలం కించిద్గృహేషు గృహమేధిని|*

*ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్॥6900॥*

"గృహిణీ! యోగసాధన చేయని వారికి గూడ గృహస్థాశ్రమమున యోగసాధన ఫలము లభించును. ఈ గృహస్థాశ్రమము నందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏవిధమైన విఘ్నములును వాటిల్లలేదుగదా!"

*16.6 (ఆరవ శ్లోకము)*

*అపి వాతిథయోఽభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా|*

*గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్॥6901॥*

*16.7 (ఏడవ శ్లోకము)*

*గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి|*

*యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః॥6902॥*

"దేవీ! నీవు గృహకార్యములయందు నిమగ్నురాలవై అలసిసొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి యుండవచ్చును. అందువలన నీకు ధైర్యము కల్గియుండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుంఢ అతిథులు వెళ్ళిపోయినచో, అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము".

*16.8 (ప్రథమ శ్లోకము)*

*అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి|*

*త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్॥6903॥*

"శుభాంగీ! నేను ఎప్పుడైననూ బయటికి వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నులయందు హవిస్సులను సకాలమున సమర్పింపలేదా? యేమి?"

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః|*

*బ్రాహ్మణోఽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖమ్॥6904॥*

"బ్రాహ్మణులు, అగ్ని, సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరిని పూజించిన గృహస్థుడు సకలకోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును".

*16.10 (పదియవ శ్లోకము)*

*అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని|*

*లక్షయేఽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్॥6905॥*

"సాధ్వీ! నీవు సర్వదా ప్రసన్నురాలవై యుందువు. కాని, ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూచినచో, నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురియైనట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరును క్షేమమేగదా!"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

*అష్టమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*బలిచక్రవర్తి స్వర్గమును జయించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*హేమజాలాక్షనిర్గచ్ఛద్ధూమేనాగురుగంధినా|*

*పాండురేణ ప్రతిచ్ఛన్నమార్గే యాంతి సురప్రియాః॥6878॥*

బంగారు కిటికీల ద్వారా అగరు సుగంధములతో గూడిన తెల్లని ధూమములు బయలువెడలి అచటి మార్గములను కప్పివేయుచుండెను. ఆ మార్గములలో దివ్యభామినులు సంచరించుచుండిరి.

*15.20 (ఇరువదియవ శ్లోకము)*

*ముక్తావితానైర్మణిహేమకేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్|*

*శిఖండిపారావతభృంగనాదితాం   వైమానికస్త్రీకలగీతమంగళామ్॥6879॥*

అచ్చటచ్చట ముత్యములు గూర్చిన మేలుకట్టులు వ్రేలాడుచుండెను. మణిమయములైన బంగారు పతాకములు, చిన్న చిన్న జెండాలు రెపరెపలాడుచుండెను. నెమళ్ళ క్రేంకారములు, పావురముల మధుర ధ్వనులు, తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా ఉండెను. దేవాంగనలు మధురముగా మంగళ గీతములను ఆలపించుచుండిరి.

*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మృదంగశంఖానకదుందుభిస్వనైః  సతాళవీణామురజర్ష్టివేణుభిః|*

*నృత్యైః సవాద్యైరుపదేవగీతకైర్మనోరమాం స్వప్రభయా జితప్రభామ్॥6880॥*

ఆ నగరమున మృదంగములు, శంఖములు, నగారాలు, డోళ్ళు, వీణలు, వేణువులు, మురజములు, ఋష్టివాద్యములు శ్రావ్యముగా మ్రోగుచుండెను. గంధర్వులు, వాద్యములతో గానములను ఆలపించుచుండిరి. అప్సరసలు నృత్యములు చేయుచుండిరి. ఈ విశేషములతో అమరావతీ శోభ ఆ నగరాధిష్ఠాత్రియగు దేవి వైభవమును మించియుండెను.

*15.22 (ఇరువదియవ శ్లోకము)*

*యాం న వ్రజంత్యధర్మిష్ఠాః ఖలా భూతద్రుహః శఠాః|*

*మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్॥6881॥*

ఆ పురమునందు అధర్మపరులు, దుష్టులు, ప్రాణులకుహాని గూర్చువారు, మోసకారులు, అహంకారులు, విషయలోలురు, కాముకులు, లోభులు ఎవరును ప్రవేశింపజాలరు. ఈ దోషములులేని వారు మాత్రమే ఆ పురమునందు ప్రవేశింతురు.

*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తాం దేవధానీం స వరూథినీపతిర్బహిః  సమంతాద్రురుధే పృతన్యయా|*

*ఆచార్యదత్తం జలజం మహాస్వనం దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషితామ్॥6882॥*

దైత్యాసేనలకు ప్రభువైన బలిచక్రవర్తి తమ గొప్ప సైన్యములతోగూడి, అమరావతీ నగరమును అన్ని వైపుల నుండి ముట్టడించెను. అతడు శుక్రాచార్యుడు ఇచ్చిన మహాశంఖమును పూరించెను. ఆ శంఖధ్వని సర్వత్ర వ్యాపించి, ఇంద్రుని భార్యల హృదయములలో భయమును కలిగించెను.

*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమమ్|*

*సర్వదేవగణోపేతో గురుమేతదువాచ హ॥6883॥*

బలిచక్రవర్తి పూర్తిగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన విషయమును ఇంద్రుడు గమనించెను. అందు వలన  అతడు దేవతలందరితో గూడి తమ గురువైన బృహస్పతియొద్ద చేరి అతనితో ఇట్లు పలికెను-

*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భగవన్నుద్యమో భూయాన్ బలేర్నః పూర్వవైరిణః|*

*అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః॥6884॥*

మహాత్మా! నాకు పూర్వశత్రువైన బలి పూర్తిగా యుద్ధమునకు సన్నద్ధుడై వచ్చినాడు. మేము అతనిని ఎదిరించుటకు సాధ్యముకాదని అనుకొనుచున్నాము. అతనికి ఇంతటి శక్తి ఎట్లు వచ్చినదో తెలియుటలేదు.

*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః|*

*పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ|*

*దహన్నివ దిశో దృగ్భిః సంవర్తాగ్నిరివోత్థితః॥6885॥*

ఈ సమయముస బలిచక్రవర్తిని ఎవ్వరుగూడ  ఎదుర్కొనజాలరు. అతడు ప్రళయాగ్నివలె మన మీదికి విజృంభించుచున్నాడు. నోటితో ఈ విశ్వములను కబళించి వేయుచున్నట్లును, పదిదిక్కులను మ్రింగివేయుచున్నట్లును చూపులతో    దశదిశలను దహించివేయు చున్నట్లును కనబడుచున్నాడు.

*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః|*

*ఓజః సహో బలం తేజో యత ఏతత్సముద్యమః॥6886॥*

గురువర్యా! నా శత్రువైన బలిచక్రవర్తి యొక్క ఎదురు లేని శక్తికి కారణమేమో తెలుపుడు. అతనికి శారీరక, మానసిక, ఇంద్రియముల యొక్క బలము ఇంతటి తేజస్సు ఎక్కడినుండి వచ్చినది? వీటి కారణముననే అతడు మనపై దండయాత్రకు సిద్ధమైనట్లున్నాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
***************

No comments: